Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాబోయే రోజుల్లో డెల్టా మరింత విజృంభణ: డబ్ల్యూహెచ్​ వో హెచ్చరిక

Delta Will be the More Dominant Strain in Coming Months Say WHO
  • 96 దేశాలకు విస్తరించిన కొత్త రకం
  • ఇంకా చాలా దేశాల్లో ఉండి ఉండొచ్చు
  • టీకా కార్యక్రమాల్లో వేగం పెంచాలని సూచన
రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది. వారాంతపు నివేదికను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ వో.. జూన్ 29 నాటికి 96 దేశాల్లో డెల్టా వేరియంట్ కనిపించిందని పేర్కొంది.

అయితే, చాలా దేశాల్లో జన్యు క్రమ విశ్లేషణ సామర్థ్యాలు తక్కువగా ఉండడంతో డెల్టాను గుర్తించడం కష్టమవుతోందని, ఇంకా చాలా దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ కేసులు ఉండి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ ఉన్న దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారని చెప్పింది. రాబోయే రోజుల్లో ఇతర వేరియంట్లను డెల్టా అధిగమించేస్తుందని పేర్కొంది.

డెల్టా సహా ఇతర రకాల కరోనాలను ఎదుర్కొనేందుకు ఇప్పటిదాకా ఏర్పరచుకున్న వనరులు సమర్థంగా పనిచేస్తాయని తెలిపింది. వేరియంట్ల వ్యాప్తి పెరిగేకొద్దీ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇప్పటికీ చాలా దేశాల్లో టీకా కార్యక్రమం చాలా నిదానంగా సాగుతోందని, ఇలాంటి సందర్భంలో వేరియంట్ల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని డబ్ల్యూహెచ్ వో సూచించింది.

కాగా, ప్రస్తుతం 172 దేశాల్లో ఆల్ఫా వేరియంట్ ఉంది. దాంతో పాటు 120 దేశాల్లో బీటా, 72 దేశాల్లో గామా వేరియంట్ వ్యాప్తి ఉంది. ఈ వారంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టిందని రిపోర్ట్ లో డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. అయితే, మయన్మార్, ఇండోనేసియా, బంగ్లాదేశ్ లలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని చెప్పింది. భారత్ లో ఈ వారం కేసులు 21 శాతం తగ్గాయంది. మొత్తంగా 3,51,218 కొత్త కేసులు వచ్చాయని చెప్పింది. మరణాలు 45 శాతం తగ్గాయని, 9,038 మంది చనిపోయారని వివరించింది.
WHO
Delta Variant
COVID19

More Telugu News