Raghu Rama Krishna Raju: ఏయ్ సజ్జల.. ఎవడ్రా నువ్వు? ఆఫ్ట్రాల్ నువ్వొక జర్నలిస్టువి!: రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy who are you asks Raghu Rama Krishna Reddy
  • నన్ను టార్గెట్ చేసేందుకు మనుషులను నియమించాడు
  • ఒక మహిళతో మెసేజ్ లు పంపిస్తున్నాడు
  • సజ్జలా, పిచ్చిపిచ్చి వేషాలు వేయకు
  • జగన్, సజ్జల ఇద్దరూ వారి పరిధిలో ఉండాలన్న రఘురాజు 
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవడ్రా నువ్వు? అంటూ పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. తనను టార్గెట్ చేసేందుకు మనుషులను నియమించాడని... సోషల్ మీడియలో ఇష్టానుసారం కామెంట్లు చేయిస్తున్నాడని మండిపడ్డారు.

'సజ్జల సూచన మేరకు తనకు ఒక వంద కాల్స్ వచ్చాయి జగన్ రెడ్డీ' అని అన్నారు. 'నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ? నీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు' అని చెప్పారు. సజ్జలను బిజ్జల అంటూ సంబోధిస్తూ... బిజ్జల దిశానిర్దేశంతో తనను అసహనానికి గురి చేస్తూ, కేసులు వేద్దామని వాళ్లంతా ప్లాన్ చేశారని అన్నారు.

తనను ట్రాప్ చేయడానికి ఒక మహిళతో మెసేజ్ లు పంపిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పతనావస్థలో ఉందని.. మీ కుట్రలన్నింటినీ త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. తన వ్యక్తిగత కార్యదర్శి ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని ఫిర్యాదు లేఖలో తెలిపానని చెప్పారు.

 'రేయ్ సజ్జల ఎవడ్రా నువ్వు? ఆఫ్ట్రాల్ నువ్వొక జర్నలిస్టువి, అనధికార రాష్ట్ర హోం మంత్రిలా వ్యవహరిస్తున్నా'వంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్ర హోమ్ మంత్రికి ఎలాంటి అధికారాలు లేకుండా చేసి, అన్ని వ్యవహారాలను నువ్వే చూసుకుంటున్నావని మండిపడ్డారు. ఈ అంశంపై నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

'సజ్జలా, పిచ్చిపిచ్చి వేషాలు వేయకు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించు, మీ వెధవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయి' అని రఘురాజు హెచ్చరించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అహంకారాన్ని పక్కన పెట్టాలని... సీఎం జగన్, సజ్జల ఇద్దరూ వారి పరిధుల్లో ఉండాలని అన్నారు. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోవద్దని హెచ్చరించారు.
Raghu Rama Krishna Raju
Sajjala Ramakrishna Reddy
Jagan
ysr

More Telugu News