టీడీపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది: మంత్రి ఆదిమూలపు
- తిరుపతి ఉప ఎన్నికపై ఆదిమూలపు వ్యాఖ్యలు
- వైసీపీదే విజయం అని ధీమా
- విపక్షాలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడాలని ఎద్దేవా
- టీడీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడి
టీడీపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆదిమూలపు ఆరోపించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే రాష్ట్రంలో పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించాడని, ఆ వీడియో ఫేక్ అని చంద్రబాబు, లోకేశ్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ లేదంటూ అచ్చెన్న అంటుంటే, లోకేశ్ మాత్రం సవాళ్లు విసురుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి బరిలో వైసీపీదే విజయం అని... రెండు, మూడు స్థానాల కోసమే విపక్షాలు పోటీ పడాల్సి ఉంటుందని అన్నారు. తిరుపతి ఓటర్లు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 5 లక్షల మెజారిటీ వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.