నాపై దుష్ప్రచారం చేయించాడు.. బూతులు తిట్టించాడు: కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

KCR tried to spoil my political career says Vijayashanthi
  • నన్ను రాజకీయాల్లో లేకుండా చేయాలని కేసీఆర్ చూశాడు
  • సోనియాగాంధీని మోసం చేశాడు
  • కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీ అయినప్పటి నుంచి తనను రాజకీయాల్లో లేకుండా చేయాలని కేసీఆర్ అనుకున్నారని చెప్పారు. 1998 నుంచి తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, బీజేపీలోనే ఉండి తెలంగాణ కోసం పోరాడానని తెలిపారు. తెలంగాణను టీడీపీ వ్యతిరేకించడంతో ఆ పార్టీకి భాగస్వామిగా ఉన్న బీజేపీ నుంచి అప్పుడు బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించానని... ఆ తర్వాత కేసీఆర్ దొరగారు వచ్చారని అన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడని చెప్పారు.

ఉద్యమంలో దూకుడుగా వెళ్తున్న తనను టీఆర్ఎస్ లో కలుపుకోవడానికి కేసీఆర్ ఎంతో ప్రయత్నించాడని విజయశాంతి అన్నారు. తాను ఒప్పుకోకపోవడంతో తనపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించాడని... తప్పని పరిస్థితుల్లో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో కలపాల్సి వచ్చిందని చెప్పారు. తన కంటే కేసీఆర్ గొప్ప నటుడని అన్నారు. తాను బీజేపీలో ఉన్నప్పుడు సోనియాగాంధీపై పోటీ చేయాలని కోరాడని తెలిపారు.

కేసీఆర్ కు చెప్పే తాను రాజశేఖరరెడ్డిని కలిశానని... అయితే, తాను కాంగ్రెస్ లో చేరబోతున్నానంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేశారని విజయశాంతి మండిపడ్డారు. ఓయూకి వెళ్తే అక్కడ తనను బండ బూతులు తిట్టించాడని, చివరకు 2013లో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశాడని విమర్శించారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టినప్పుడు తాను మాత్రమే ఉన్నానని, ఆ రోజు కేసీఆర్ లేడని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి సోనియాగాంధీని మోసం చేశాడని దుయ్యబట్టారు. అమాయకులైన తెలంగాణ ప్రజలు ఇంతవరకు కేసీఆర్ ను నమ్మారని... ఇకపై నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఇప్పుడు కరెక్ట్ పార్టీ వచ్చిందని, ఇకపై కేసీఆర్ ఉండడని చెప్పారు. కేసీఆర్ కు ప్రతి దానికి డబ్బులు కావాలని... డబ్బులు ఏం చేసుకుంటావు దొరా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం చనిపోయిన వారి శవాల మీద కూర్చొని కేసీఆర్ పాలిస్తున్నాడని అన్నారు.
Go Back to Shorts
Vijayashanti
BJP
KCR
TRS

More Telugu News