Revanth Reddy: ఓ మంత్రిగారి వియ్యంకుడి చేతిలో మొత్తం గుట్కా బిజినెస్ నడుస్తోంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy take a dig at CM KCR and KTR
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, పైగా చెరువులను, పార్కులను టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అనుచరులు వందల చెరువులను కబ్జా చేశారని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి అయ్యాక నాలాలు కబ్జాలకు గురయ్యాయని, వందేళ్లలో జరగని ఆక్రమణలు సీఎంగా కేసీఆర్ వచ్చాక ఆరేళ్లలోనే జరిగాయని విమర్శించారు.  

మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలు చెరువుల్లోనే నిర్మించారని ఆరోపించారు. ఓ మంత్రిగారి వియ్యంకుడి చేతిలో గుట్కా దందా నడుస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అవాస్తవాలను ప్రచారంచేస్తూ టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అబద్ధాలున్న పుస్తకం టీఆర్ఎస్ ప్రగతి నివేదిక అని ఎద్దేవాచేశారు. ఇప్పటివరకు  సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ నిజాయతీగా ఒక్క నిజం అయినా చెబుతారేమోనని చూశానని, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడే పరిస్థితి కనిపించడంలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఔటర్ రింగ్ రోడ్డును వేల కోట్ల ఖర్చుతో నిర్మించినట్టు టీఆర్ఎస్ వాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఔటర్ రింగ్ రోడ్డు సహా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ, ఐటీ సంస్థలు, మెట్రో రైలు, గోదావరి, కృష్ణా జలాలు, ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ ప్రెస్ వే అన్నీ కూడా గత టీడీపీ,  కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వచ్చినవేనని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న ప్రారంభోత్సవాలు పూర్తి చేయడం తప్ప టీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదని వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Revanth Reddy
KCR
KTR
GHMC Elections
Hyderabad
TRS
Congress
Telangana

More Telugu News