కోహ్లీ ఉంటే బెంగళూరుకు కప్పు కలే.. విరుచుకుపడుతున్న అభిమానులు
- ఎలిమినేటర్ మ్యాచ్లో దారుణంగా ఆడిన బెంగళూరు
- భారత జట్టుకు కోహ్లీ పెద్దగా సాధించినదేమీ లేదన్న అభిమానులు
- తమ ప్రయాణం అద్భుతంగా సాగిందన్న కోహ్లీ
ఓటమి అనంతరం ఆ జట్టుపై బెంగళూరు అభిమానులు విరుచుకుపడ్డారు. బెంగళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్గా ఉండగా కప్పు సాధించడం అసాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు కూడా కోహ్లీ పెద్దగా సాధించినదేమీ లేదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్ అనంతరం కోహ్లీ తన జట్టుతో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఒడిదొడుకుల సమయంలోనూ జట్టు సమష్టిగా ఉందని, ఒక బృందంగా ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉందని అన్నాడు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవన్నది నిజమే అయినా తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని అన్నాడు. తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన కోహ్లీ.. త్వరలోనే మళ్లీ అభిమానుల ముందుకు వస్తామని పేర్కొన్నాడు.