జార్జియా, మిచిగన్ లో న్యాయ పోరాటంలో ఓడిపోయిన ట్రంప్!
- రెండు రాష్ట్రాల ఫలితాలను సవాల్ చేసిన ట్రంప్ టీమ్
- రెండు చోట్లా లభించని ఊరట
- ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
జార్జియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ బాస్, ఈ మేరకు తీర్పునిస్తూ, బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని వ్యాఖ్యానించారు. మిచిగన్ కేసులో న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్, కేసును విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు భావించడం లేదన్నారు. ఇక, నెవెడా విషయంలోనూ, అందునా జనాబా ఎక్కువగా ఉన్న క్లార్క్ కౌంటీ, లాస్ వెగాస్ ఓటింగ్ లోనూ అక్రమాలు జరిగాయని ట్రంప్ అనుచురులు ఆరోపిస్తున్నారు.
ఇక, మిచిగన్, జార్జియా కోర్టు తీర్పులపై ట్రంప్ ప్రతినిధులు అధికారికంగా స్పందించలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. నెవెడాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మిచిగన్ లో విజయం బైడెన్ పరమైంది. జార్జియాలో మాత్రం ట్రంప్ అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నెవెడాలో చెల్లని ఓట్లను లెక్కించి, వాటిని బైడెన్ ఖాతాలో కలిపారని, కరోనా కాలంలో క్లార్క్ కౌంటీని విడిచి వెళ్లిపోయిన వేలాది మంది ఓట్లను తీసుకొచ్చి కలిపారని తమకు అనుమానాలు ఉన్నాయని నెవడా మాజీ అటార్నీ జనరల్, ట్రంప్ టీమ్ సభ్యుడు అడామ్ లక్సలత్ ఆరోపించారు. ఈ విషయంలో మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.