రైల్వే నుంచి సరికొత్త సేవలు.. ఇక సామన్లు మోసుకెళ్లే బాధ తప్పినట్టే!

Bags on wheels will make train journey more easier
రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ముందుకొచ్చింది. ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా ఆ పనిని రైల్వేనే చేయనుంది. నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలను అందించనున్నట్టు తెలిపిన రైల్వే ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్‌ స్టేషన్లలో తొలుత ఈ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ‘బ్యాగ్స్ ఆన్ వీల్స్’ (బీవోడబ్ల్యూ) అనే మొబైల్ అప్లికేషన్‌ను తీసుకురాబోతోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులిద్దరికీ ఈ యాప్ అందుబాటులో ఉండనుంది. దేశంలో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కానుంది.

ఈ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికులు తమ సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు తరలించే సేవలు పొందవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీలను భద్రంగా చేరుస్తారు. అతి తక్కువ రుసుముతోనే డోర్-టు-డోర్ సేవలు అందిస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తొలుత ఈ సేవలను న్యూఢిల్లీ, ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సరయ్ రోహిల్లా, ఘజియాబాద్, గురుగ్రామ్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ సేవల వల్ల రైల్వే ఆదాయం మరింత పెరుగుతుందని ఢిల్లీ డీఆర్ఎం ఎస్‌సీ జైన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Indian Railways
Bags on wheels
rail passengers

More Telugu News