ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి, చేయకుంటే రెట్టింపు అద్దె: నూతన అద్దె చట్టం ముసాయిదా ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి, చేయకుంటే రెట్టింపు అద్దె: నూతన అద్దె చట్టం ముసాయిదా ఇదే!

New Rental Act is Ready
  • కొత్త అద్దె చట్టాన్ని సిద్ధం చేసిన కేంద్రం
  • 31లోగా అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలకు ఆదేశం
  • ప్రజలకు 15 రోజుల సమయం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇళ్లను అద్దెలకు ఇచ్చే వారి ప్రయోజనాలను పరిరక్షించేలా, కొత్త అద్దె చట్టం-2020 ముసాయిదాను కేంద్రం సిద్ధం చేసింది. దీనిపై అన్ని రాష్ట్రాలూ అభిప్రాయాలను తెలపాలని కోరుతూ అక్టోబర్ 31 వరకూ సమయం ఇచ్చింది. ఈ లేఖను అందుకున్న తెలంగాణ పురపాలక శాఖ 15 రోజుల్లో తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ ప్రజలను కోరింది. ఇక ఈ ముసాయిదాను యజమానులు, అద్దెలకు ఉండేవాళ్ల హక్కులకు సమానమైన ప్రాధాన్యతను ఇచ్చేలా తయారు చేసినట్టు కేంద్రం చెబుతోంది.

చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితరాల కోసం పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త అద్దె చట్టం అవసరమని భావిస్తున్నామని, గృహ సముదాయం, పరిమాణం, నాణ్యతల ఆధారంగా అద్దె నిర్ణయాలు జరుగుతుండటంతో గృహ యజమానులు నిరుత్సాహంగా ఉన్నారని కేంద్రం ఈ ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు లేకున్నా అధిక అద్దెలు చెల్లించాల్సి వస్తోందని, మరికొన్ని చోట్ల అన్ని సౌకర్యాలున్నా, తక్కువ అద్దెలే వస్తున్నాయని తెలిపింది.

ఈ ముసాయిదాలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... దేశంలో ఎక్కడైనా ఇకపై అద్దెకు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, ఓనర్, టెనెంట్ మధ్య పరస్పర రాతపూర్వక అంగీకారం తప్పనిసరి. ఇదే సమయంలో ఏదైనా వివాదం ఏర్పడితే పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ క్వాసీ జ్యుడీషియల్ మెకానిజం సిద్ధంగా ఉంటుంది. నివాస ప్రాంతాల్లో గరిష్ఠంగా రెండు నెలల అద్దె, వాణిజ్య ప్రాంతాల్లో ఆరు నెలల అద్దె అడ్వాన్స్ మించరాదు.

ఇక పలు ఢిపాల్ట్ నిబంధనలను కూడా కేంద్రం ఈ ముసాయిదాలో చేర్చింది. అద్దె చెల్లించడంలో విఫలమైతే, టెనెంట్, తదుపరి వడ్డీతో సహా అద్దెను చెల్లించాల్సి వుంటుంది. తొలుత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఇంటిని ఖాళీ చేయడంలో విఫలమైతే, మొదటి రెండు నెలల అద్దె రెట్టింపవుతుంది. ఆపై నెలకు నాలుగు రెట్ల అద్దెను చెల్లించాల్సి వస్తుంది. వివాదాల సత్వర పరిష్కారానికి జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు. జిల్లా న్యాయమూర్తి లేదా అదనపు జిల్లా న్యాయమూర్తి వీటిని విచారిస్తారు. తీర్పు తమకు వ్యతిరేకంగా ఉందని భావించిన వారు అపీలు కూడా చేసుకోవచ్చు.
Tolet
Tenent
New Bill
Owner
Rent

More Telugu News