బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా
- ఆసుపత్రికి ఫోన్ చేసి స్వయంగా వివరాలు తెలుసుకున్న వెంకయ్య
- అవసరమైతే నిపుణులను సంప్రదించాలని సూచన
- ఆరోగ్యం విషమంగానే ఉందన్న కమల్
బాలు ఆరోగ్యం క్షీణించిందంటూ నిన్న సాయంత్రం ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేయడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నటుడు కమలహాసన్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి బాలు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలు క్షేమంగా ఉన్నారని చెప్పలేను కానీ, ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తున్నారని చెప్పారు.
కాగా, కరోనా బారినపడిన బాలు ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఉండడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. అంతలోనే బాలు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.