నేరేడ్‌మెట్ ప్రాంతంలో సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలిక అదృశ్యం.. నాలాల్లో గాలిస్తున్న అధికారులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేరేడ్‌మెట్ ప్రాంతంలో సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలిక అదృశ్యం.. నాలాల్లో గాలిస్తున్న అధికారులు

10 year old girl missing in Hyderabad search operation begin
  • బాలిక సైకిల్ తొక్కుతున్న ఫుటేజీ లభ్యం
  • పొరపాటున నాలాలో పడిపోయి ఉండొచ్చని అనుమానం
  • పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఓ బాలిక అదృశ్యమైంది. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక సుమేధా కాపూరియా (10) ఆచూకీ నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి చిక్కడం లేదు. చిన్నారి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలిస్తున్నారు. సైకిల్ తొక్కుకుంటూ ఉన్న బాలిక దాదాపు గంటపాటు అదే ప్రాంతంలో తిరిగినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని బట్టి తెలుస్తోంది. అయితే, ఆ ప్రాంతం దాటిన తర్వాతే బాలిక అదృశ్యమైనట్టు సమాచారం.

నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైకి నీరు చేరడంతో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో కానీ, పొరపాటున నాలాలో కానీ పడిపోయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు సమీపంలోని నాలాల్లో గాలిస్తున్నారు. అలాగే, ఎక్కడికైనా వెళ్లిపోయిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రెస్క్యూ టీంతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా బాలిక కోసం గాలింపు మొదలుపెట్టారు. భారీ వర్షం కారణంగా నాలాలు పొంగి పొర్లుతుండడంతో ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది. బాలిక అదృశ్యంపై స్పష్టమైన సమాచారం మాత్రం ఇప్పటి వరకు లేదని, కేవలం అనుమానంతోనే నాలాల్లో గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరో రెండుమూడు గంటల్లో ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Hyderabad
Neredmet
Girl
Missing
Police

More Telugu News