Telangana: రాష్ట్ర బీజేపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి

Telangana minister warns state BJP leaders
  • కేంద్రం ఇచ్చింది రూ. 210 కోట్లే
  • గతేడాది రూ. 11,725 కోట్లను పింఛన్ల కోసం కేటాయించాం: ఎర్రబెల్లి
  • జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే విద్యుత్ ప్రమాదాలు: జగదీశ్‌రెడ్డి
ఆసరా పింఛన్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆసరా పింఛన్లకు కేంద్రం ఇచ్చింది రూ. 210 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసరా పింఛన్లపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఎర్రబెల్లి.. రాష్ట్రప్రభుత్వం గతేడాది రూ. 11,725 కోట్లను పింఛన్ల కోసం కేటాయించిందన్నారు. కేంద్రం మాత్రం రూ. 210 కోట్లు అంటే 1.8 శాతం మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయం తెలియకుండా బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులను ఇబ్బందులకు గురిచేసే ఉప సర్పంచుల చెక్‌పవర్‌ను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.41 కోట్ల ఎకరాల్లో పంటలను సాగుచేసినట్టు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో మరో లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. 25 జిల్లాల్లోని 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

ట్రాన్స్ ఫార్మర్లకు ఏబీ స్విచ్‌లు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజం కాదని, విద్యుత్ స్తంభాలు ఎక్కేవారు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని మరో మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
Telangana
Errabelli
G Jagadish Reddy
Aasara pensions

More Telugu News