కేంద్ర మార్గదర్శకాల కారణంగా ఇబ్బందులు.. త్వరలో వైద్యశాఖలో 11 వేల పోస్టుల భర్తీ: ఈటల
- శాసన సభ, మండలిలో మాట్లాడిన మంత్రి ఈటల
- కరోనా చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేయడం కలచివేసిందన్న మంత్రి
- వెంటిలేటర్‌పై ఉంచి చేసినా లక్ష దాటదన్న ఈటల
వీటిలో వైద్యులతోపాటు ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఉన్నాయన్నారు. కేంద్రం తాజా మార్గదర్శకాల వల్ల వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలనుకున్న వైద్య కశాశాలకు కూడా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కరోనాపై శాసన మండలిలో జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా సాధారణ చికిత్సకు రూ. 10 వేలు అవుతుందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రూ. 50 వేలు, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తే లక్ష రూపాయల వరకు కావచ్చని అన్నారు. కానీ లక్షలాది రూపాయలు వసూలు చేయడం చూసి తాను కలత చెందానని అన్నారు. చికిత్సలో భాగంగా ఇచ్చే ఇంజక్షన్ ధర గరిష్ఠంగా రూ. 32 వేలు ఉంటుందని, అది ఒకటి ఇస్తే సరిపోతుందని అన్నారు. కానీ ఇలా అడ్డగోలుగా వసూళ్లు చేయడంపై కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి హెచ్చరించినట్టు చెప్పారు.