చైనా సైనికులను మట్టికరిపించిన భారత జవాన్లు... పాంగ్యాంగ్ సరస్సు కీలక ప్రాంతం స్వాధీనం!
- ఎత్తయిన ప్రాంతాన్ని ఆక్రమించిన చైనా సైన్యం
- సమర్థవంతంగా అడ్డుకుని వెనక్కు తరిమిన జవాన్లు
- చైనా జవాన్లను అడ్డుకున్న స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్
ఆగస్టు 29-30 మధ్య ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. చైనా సైనికులు భారీ ఎత్తున మెషీన్లను తెచ్చి, ఇక్కడ నిర్మాణాలు చేపట్టగా దాన్ని భారత సైనికులు అడ్డుకున్నారు. "ఈ ప్రాంతంలో ఉన్న స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్ చైనాను అడ్డుకుంది. సరస్సు దక్షిణ భాగంలోని తౌకుంగ్ ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది ఓ వ్యూహాత్మక ప్రాంతం. ఇక్కడి నుంచి సరస్సు పశ్చిమ ప్రాంతాన్నంతా నియంత్రించ వచ్చు. సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలపైనా నిఘా పెట్టవచ్చు" అని సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రాంతం కూడా వాస్తవానికి వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూ భాగంలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రాంతం తమ దేశానికి చెందినదని చైనా చాలా కాలంగా వాదిస్తోంది. ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు బ్రిగేడియర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలు ఇంతవరకూ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఓ వైపు చర్చలు జరుగుతుండగా, భారత సైన్యం, నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా కమాండర్ ఆరోపించగా, భారత్ వాటిని కొట్టిపారేసింది. చైనా జవాన్లే రెచ్చగొడుతూ మన భూభాగంపైకి దండెత్తేందుకు వస్తున్నారని, భారత ఆర్మీ దాన్ని ఎదుర్కొంటోందని భారత సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.