ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్
- వచ్చేనెల 15లోగా ఒప్పందం చేసుకోవాలన్న ట్రంప్
- ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ టిక్‌టాక్ పిటిషన్
- తమ వాదనను అమెరికా ప్రభుత్వం వినట్లేదని వ్యాఖ్య
ట్రంప్ నిర్ణయంపై తమ వాదనను వినేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటంతో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో తాము పిటిషన్ దాఖలు చేసినట్లు టిక్‌టాక్ తెలిపింది. అమెరికా భద్రతకు సంబంధించి ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, రాజకీయ ఉద్దేశాలతోనే తీసుకున్నారని ఆరోపణలు గుప్పించింది.
తమ మాతృ సంస్థ బైట్‌డాన్స్ అమెరికాలో ఆస్తులను వదులుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం పక్షపాత ధోరణితో ఉందని ఆరోపించింది. ట్రంప్‌తో పాటు కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్, అమెరికా వాణిజ్య శాఖలపై టిక్‌టాక్ ఫిర్యాదు చేసింది. తమ యాప్ అమెరికాలో అత్యంత భద్రత మధ్య కొనసాగుతోందని పేర్కొంది. టిక్‌టాక్ కోర్టును ఆశ్రయించడం.. అమెరికా సంస్థలు జరుపుతోన్న కొనుగోలు చర్చల్లో ధర పెరిగేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.