కేసీఆర్ ఆరోపణలపై సమీక్షా సమావేశంలో ప్రస్తావన.. స్పందించిన సీఎం జగన్!
- కేసీఆర్ ఆరోపణలను పట్టించుకోవద్దు
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదు
- అపెక్స్ కౌన్సిల్ లోనే సమాధానం చెబుదాం
- ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టుల ఉత్తర్వులు సిద్ధం చేయండి
- నీటి పారుదల శాఖ సమీక్షలో వైఎస్ జగన్
తెలంగాణతో స్నేహ పూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామని, ఇదే సమయంలో కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకే చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రాజెక్టులపై రాష్ట్రం విడిపోవడానికి ముందు నుంచి అమలులో ఉన్న ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు కృషి చేయాలని, పునరావాస కార్యక్రమాలపై దృష్టిని సారించాలని కూడా జగన్ ఆదేశించారు. ప్రాజెక్టు వ్యయంపై పెట్టిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను తయారు చేసి కేంద్రానికి పంపాలని సూచించిన జగన్, వివిధ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. గండికోట, చిత్రావతి రిజర్వాయర్, పైడిపాలెం ఎత్తిపోతల అభివృద్ధి పనులతో పాటు గాలేరు - నగరి, హంద్రీ - నీవా లింక్ కెనాల్ పనుల ప్రస్తావన కూడా ఈ సమీక్షలో వచ్చింది.