మారుతికి కలిసొచ్చిన ఆ మోడల్ కారు మళ్లీ వస్తోందా..?
- 80వ దశకంలో ఓ ఊపు ఊపిన మారుతి 800 కారు
- కొంతకాలం కిందట 800 ఉత్పత్తి నిలిపివేసిన మారుతి
- ఆధునిక సౌకర్యాలతో త్వరలోనే సరికొత్త కారు!
80వ దశకంలో మొదలైన మారుతి 800 కారు వైభవం 2000వ సంవత్సరం తర్వాత తగ్గిపోయింది. ఆల్టో మోడల్ ను అభివృద్ధి చేసిన మారుతి తన పాతకారుకు విశ్రాంతినిచ్చింది. అయితే, మారుతున్న వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని 800 మోడల్ ను మారుతి మళ్లీ తెరపైకి తెస్తోందని ప్రచారం జరుగుతోంది. తక్కువ బడ్జెట్ లో కొన్ని మోడళ్లు తెస్తున్నామన్న మారుతి సుజుకి ప్రతినిధి మాటలే అందుకు నిదర్శనం.
ఇక ఈ కారు ధర రూ.3 లక్షల రేంజిలో ఉంటుందని, ధర తక్కువైనా ఇప్పుడున్న కాంపాక్ట్ కార్లలో ఉండే అన్ని సౌకర్యాలు దీంట్లో ఉంటాయని సమాచారం. ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే ఇన్ఫోటైన్ మెంట్ తో వచ్చే కొత్త 800 కారు ఎలా ఉంటుందన్న దానిపై ఆటోమొబైల్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి!