రాబోయే కాలం కరోనాకు బాగా అనుకూలం: ఐఐటీ-ఎయిమ్స్
- వర్షాలతో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- తక్కువ ఉష్ణోగ్రతల్లో వైరస్ విజృంభిస్తుందంటున్న పరిశోధకులు
- ఆ తర్వాత వచ్చే చలికాలంలో భీకరస్థాయిలో వైరస్ వ్యాప్తి
రుతుపవనాల సీజన్ పతాకస్థాయికి చేరినప్పుడు, చలికాలంలో కరోనా వ్యాప్తి భారత్ లో అత్యంత భీకరస్థాయికి చేరుతుందని పరిశోధకులు వెల్లడించారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ఆ తర్వాత వచ్చే చలికాలం వాతావరణ పరంగా వైరస్ మనుగడకు అత్యంత అనుకూలమని ఐఐటీ భువనేశ్వర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినోజ్ తెలిపారు.
ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కరోనా వ్యాప్తి క్షీణతకు కారణమవుతుందని, కానీ రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనుండడమే ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేసులు రెట్టింపు అయ్యే పరిస్థితులపై ఉష్ణోగ్రత, వాతావరణంలో తేమ ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నట్టు అధ్యయనం ద్వారా గుర్తించారు. వాతావరణంలో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే కరోనా కేసుల నమోదులో 0.99 శాతం తగ్గుదల కనిపిస్తుందని, కేసులు రెట్టింపయ్యే సమయం 1.13 రోజులకు పెరుగుతుందని వివరించారు.