వివాద పరిష్కారానికి.. బ్యాంకులకు విజయ్ మాల్యా మరో ఆఫర్!
- బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన మాల్యా
- మొత్తం రూ. 13,690 కోట్లు చెల్లిస్తా
- సెటిల్ మెంట్ ప్యాకేజీని ముందుంచిన మాల్యా
గతంలో మాల్యా ఇచ్చిన ఆఫర్లను బ్యాంకుల కన్సార్టియం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు మాల్యా తరఫు న్యాయవాది తెలిపారు. బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా రూ. 9 వేల కోట్ల రుణాలను పొందగా, అది వడ్డీతో కలిపి రూ. 13,960 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కు తెచ్చేందుకు సీబీఐ, ఈడీ తదితర భారత సంస్థలు రంగంలోకి దిగాయి.
ఈ నేపథ్యంలో, తాను చెల్లించాల్సిన మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తానంటూ సెటిల్ మెంట్ ప్యాకేజ్ ఆఫర్ ను మాల్యా తెరపైకి తెచ్చారు. మాల్యాను తిరిగి ఇండియాకు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టులు ఆదేశించిన తరువాత, కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నాయని చెబుతూ, బ్రిటీష్ హై కమిషన్ ఈ ప్రక్రియకు తాత్కాలిక బ్రేకులు వేసింది. ఇదే సమయంలో తనను శరణార్థిగా పరిగణించి, బ్రిటన్ లో ఉండేందుకు అనుమతించాలని మాల్యా పెట్టుకున్న పిటిషన్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మాల్యా నుంచి ఇటువంటి ఆఫర్ రావడం గమనార్హం.