ట్విట్టర్‌ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా అతి పెద్ద హ్యాకింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్‌ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా అతి పెద్ద హ్యాకింగ్!

Barack Obama Joe Biden Elon Musk Apple and others hacked in unprecedented Twitter attack
  • బిట్‌ కాయిన్ స్కామ్‌కు పాల్పడాలని యత్నించిన హ్యాకర్లు
  • ఒబామా, జో బిడెన్, బిల్ గేట్స్ ఖాతాలు హ్యాక్
  • టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్  జెఫ్ బెజోస్ ఖాతాలు కూడా
  • పలు సంస్థల ఖాతాల్లోనూ హ్యాకర్ల ట్వీట్లు
  • తిరిగి సవరించిన ట్విట్టర్ టీమ్‌  
ట్విట్టర్‌లో ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల, ప్రముఖ దిగ్గజ సంస్థల ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి. ప్రముఖులు ట్వీట్లు చేసినట్లు హ్యాకర్లు ట్వీట్ చేసి బిట్‌ కాయిన్ స్కామ్‌కు పాల్పడాలని ప్రయత్నించారు.

వెంటనే బిట్‌కాయిన్స్‌ పంపితే, అందుకు రెట్టింపు మొత్తాన్ని తిరిగి పొందవచ్చని హ్యాకర్లు ఆ ఖాతాల్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌తో పాటు పలువురు ప్రముఖుల ఖాతాలు ఈ విధంగా హ్యాకయ్యాయి.

అలాగే, ఆపిల్, ఉబెర్ సంస్థలతో పాటు హిప్-హాప్ మొగల్ కాన్యే వెస్ట్, న్యూయార్క్ నగర మాజీ మేయర్‌, బిలియనీర్ మైక్ బ్లూమ్‌బర్గ్ వంటి వారి ఖాతాలు కూడా హ్యాకర్ల బారినపడ్డాయి. అలాగే, క్రిప్టో సంస్థలు జెమిని క్రిప్టో కరెన్సీ ఎక్స్‌చేంజ్, కాయిన్ ఎంబేస్ యాప్‌, టైలర్ వింక్లివోస్ సైతం హ్యాకర్ల బారినపడ్డాయి.

తొలుత టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్‌ ఖాతాలో బిట్‌ కాయిన్‌ స్కామ్‌కు పాల్పడేందుకు హ్యాకర్లు చేసిన ట్వీట్లు కనపడ్డాయి. ఆ తర్వాత వెంటనే బిల్‌గేట్స్‌ ఖాతాలోనూ ఇటువంటి ట్వీట్లే కనిపించాయి. 'ఈ ట్వీట్‌ను బిల్‌గేట్స్‌ చేయలేదు. ట్విట్టర్‌లో తలెత్తిన లోపం కారణంగా ఈ ట్వీట్లు కనపడినట్లు తెలుస్తోంది' అని బిల్‌గేట్స్‌ ప్రతినిధి రికోడ్స్‌ టెడ్డీ తెలిపారు.

హ్యాకర్లు ఈ చర్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించిన ట్విట్టర్‌ వెంటనే హ్యాకింగ్‌ గురైన ప్రముఖుల ఖాతాలను కాసేపు నిలిపేసి, ఆ ఖాతాల్లో హ్యాకర్లు చేసిన ట్వీట్లను తొలగించింది. ఈ విషయాన్ని తమ 'ట్విట్టర్ సపోర్ట్‌' ఖాతాల్లో ట్విట్టర్‌ సంస్థ వివరించింది. కొన్ని ఖాతాల్లో ఇటువంటి ట్వీట్లు వస్తున్నాయని, తాము దీనిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.

ట్విట్టర్‌ సంస్థకు ఇదో క్లిష్టమైన రోజని, ఇలా ఎందుకు జరిగిందో నిర్ధారించుకునేందుకు కృషి చేస్తున్నామని ట్విట్టర్ సీఈవో జాక్‌ తెలిపారు. ఈ లోపాన్ని సరిచేసేందుకు ట్విట్టర్‌ టీమ్‌ కష్టపడి పనిచేస్తోందని తెలిపారు. కాగా, గతంలోనూ కొందరు ప్రముఖుల ఖాతాలు హ్యాకర్ల బారిన పడగా అప్పట్లో వాటిని కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, ఈ సారి ఒక్కసారిగా చాలా మంది ప్రముఖుల ఖాతాలు ఒకేసారి హ్యాకర్లబారిన పడ్డాయి.
Twitter
Social Media
obama

More Telugu News