ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో జలాలు వాడుకోవాలి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టీకరణ

Krishna river board meeting held at Hyderabad
  • తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు
  • హైదరాబాదులోని జల్ సౌధలో సమావేశమైన కృష్ణా బోర్డు
  • కీలక నిర్ణయాలు వెల్లడించిన బోర్డు చైర్మన్ పరమేశం
ఇటీవలే తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంపై వివాదాలు తల్తెతగా, దీనిపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాదులోని జలసౌధలో సుదీర్ఘ సమయం పాటు సాగిన ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దీనిపై కృష్ణా బోర్డు  కీలక నిర్ణయాలు వెలువరించింది. భేటీ అనంతరం బోర్డు చైర్మన్ పరమేశం మీడియా సమావేశం నిర్వహించారు.  ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని సూచించినట్టు తెలిపారు. శ్రీశైలం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గతంలోనూ అదే నిష్పత్తి అమల్లో ఉండేదని తెలిపారు.

ఇక వరద సమయంలో ఉపయోగించిన జలాలకు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలిస్తోందని వివరించారు. తాగునీటి వినియోగాన్ని 20 శాతం లెక్కింపుపై జల సంఘానికి నివేదించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించినట్టు చెప్పారు. ఏపీలో గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు తరలించిన జలాల అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించామని పరమేశం పేర్కొన్నారు.

కృష్ణా బోర్డును ఏపీ రాజధానికి తరలించే అంశంలో కేంద్ర జలశక్తి శాఖదే తుది నిర్ణయం అని అన్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్ లు ఇవ్వాలని స్పష్టం చేశామని.... అనుమతులు తీసుకుని డీపీఆర్ లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని, అంతేగాకుండా, రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతాంశంగా పరిగణించి అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయని వివరించారు.
Go Back to Shorts
Krishna River
Board
Andhra Pradesh
Telangana

More Telugu News