తెలంగాణలో కూడా మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్?

KCR Will Take A decission on Liquor Shops Today
  • చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో తెరచుకున్న దుకాణాలు
  • ఇక్కడ ఓపెన్ చేయకుంటే అక్రమ రవాణాకు అవకాశాలు
  • సరిహద్దులు దాటి వెళ్లే ప్రజలతో వైరస్ వ్యాప్తి
  • కేసీఆర్ కు స్పష్టం చేసిన అధికారులు
మార్చి 22 నుంచి తెలంగాణలో మూతబడివున్న మద్యం దుకాణాలను నేడో, రేపో తెరవాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొందని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు. నేడు జరగాల్సిన క్యాబినెట్ సమావేశపు ఎజెండాను ఖరారు చేసేందుకు అధికారులు, మంత్రులతో ప్రగతి భవన్ లో కేసీఆర్ సమీక్ష నిర్వహించగా, మద్యం దుకాణాల ప్రస్తావన వచ్చింది.

లాక్ డౌన్ సమయంలోనూ మద్యం విక్రయాలను అనుమతించాలని ఎంతగా ఒత్తిడి వచ్చినా, వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలను అనుమతించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక, కేంద్రం ఇచ్చిన తాజా సడలింపులతో పలు రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు 7వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ కారణంతో సోమవారం నాడు మద్యం షాపులను తెరవలేదు.

ఇక, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లో షాపులు తెరవడంతో ఇక్కడా తెరవాల్సిన పరిస్థితి నెలకొందని, లేకుంటే అక్కడ నుంచి మద్యం అక్రమ రవాణాతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, నిన్న కేసీఆర్ కు వివరించిన అధికారులు, మద్యం కోసం సరిహద్దులను దాటి పక్క రాష్ట్రాలకు ప్రజలు వెళ్లే అవకాశం ఇవ్వవద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ పెరిగిపోతుందని కూడా వారు గుర్తు చేశారు.

ఇక రాష్ట్రంలో మద్యం దుకాణాలపై నేడు జరిగే క్యాబినెట్ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం ప్రకటించిన సడలింపులకూ ఓకే చెబుతూ, మిగతా రాష్ట్రాల మాదిరిగానే, కంటైన్ మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన చోట్ల మద్యం విక్రయాలకు అనుమతించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో లాక్ ‌డౌన్ ను‌ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
Go Back to Shorts
KCR
Liquor
Telangana
Cabinet Meeting

More Telugu News