మే 4 నుంచి కూడా ప్రజా రవాణా అనుమానమే... 15 తరువాత ఆలోచించాలని కేంద్ర మంత్రుల కీలక నిర్ణయం!
- మే 3తో ముగియనున్న 40 రోజుల లాక్ డౌన్
- ఆ తరువాత కూడా విమానాలు, రైళ్ల పునరుద్ధరణపై అనుమానాలు
- తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న కేంద్రం
"విమానాల సర్వీసులపై ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఇదే సమయంలో విమానాలను పార్కింగ్ చేసి వుండటం ఆయా సంస్థల ఖర్చును పెంచుతోంది. మే 4 నుంచి కూడా ప్రయాణాలపై ఆంక్షలు ఉండవచ్చు. 15 తరువాత పరిస్థితిపై తదుపరి సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి" అని ఇదే సమావేశానికి హాజరై, పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. విమాన సర్వీసుల విషయమై ఆ శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి స్పందించేందుకు నిరాకరించారు.
"ఇండియాలో విమానాలు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఓ తేదీని నిర్ణయించలేదు. నిజం చెప్పాలంటే ఇందుకు కొంత సమయం పడుతుంది. ప్రజా రవాణా పునరుద్ధరణ అంటే, లాక్ డౌన్ పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చు" అని మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఎయిర్ ఇండియా మే 4 నుంచి దేశవాళీ సర్వీసులకు, జూన్ 1 నుంచి విదేశీ సర్వీసులను టికెట్ల బుకింగ్ ను ప్రారంభించింది.