Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రికవరీ అయిన వారందరికీ మళ్లీ కరోనా పరీక్షలు... చైనా సంచలన నిర్ణయం!

China Orders Re test of Healed COVID 19 Patients
  • విదేశాల నుంచి వచ్చిన వారితో పెరుగుతున్న కేసులు
  • సెకండ్ వేవ్ లో 1,104 పాజిటివ్ గా నిర్ధారణ 
  • రికవరీ అయిన వారంతా హోమ్ క్వారంటైన్ 
  • పలు నిబంధనలు విధించిన చైనా ప్రభుత్వం
చైనాలో కరోనా సోకి, రికవరీ అయిన ప్రతి ఒక్కరికీ మరోసారి పరీక్షలు చేయాలని చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో సెకండ్ వేవ్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా 76 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉండిపోయిన వూహాన్ లో నిబంధనలను సడలించిన మరుసటి రోజు, చైనా తన నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇక, గురువారం నాడు కొత్తగా 63 కరోనా పాజిటివ్ కేసులు రాగా, అందులో 61 మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారేనని చైనా నేషనల్ హెల్త్ మిషన్ ప్రకటించింది. దీంతో చైనాలో సెకండ్ వేవ్ లో భాగంగా 1,104 కేసులు నమోదైనట్లయింది. మరో ఇద్దరు మృత్యువాత పడటంతో కరోనా మృతుల సంఖ్య 3,335కు చేరగా, మొత్తం కేసుల సంఖ్య 81,865కు చేరుకుంది.

వాస్తవానికి మూడు నెలల అవిశ్రాంత పోరాటం అనంతరం, చైనాలో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఇంకా చెప్పాలంటే, శరవేగంగా తమ దేశంలో కరోనాను చైనా అదుపులోకి తెచ్చింది. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విమానాల నిలిపివేతతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారు, తిరిగి స్వదేశానికి చేరుతూ ఉండటంతో, కేసుల సంఖ్య పెరుగుతోంది.

దీంతో చైనా, కరోనా వైరస్ సోకి, ఆపై నెగటివ్ వచ్చిన వారందరి కోసం కొత్త ట్రయల్ ప్రొటోకాల్ ను విడుదల చేసింది. వీరందరినీ డాక్టర్లు పరీక్షిస్తారని, వారి నుంచి నమూనాలను స్వీకరించి, మరోసారి పరీక్షలకు పంపుతారని స్పష్టం చేసింది. కరోనా పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న వూహాన్ లో కరోనా నుంచి 77,370 మంది బయటపడగా, వారందరికీ ఇప్పుడు తిరిగి రక్త పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు కదులుతున్నారు.

చైనా విధించిన కొత్త నిబంధనల ప్రకారం, కరోనా నుంచి బయటపడిన వారంతా 14 రోజుల పాటు విధిగా హోమ్ క్వారంటైన్ పాటించాలి. వీరెవరూ బయట తిరిగేందుకు వీల్లేదు. ఇంట్లోగానీ ఐసొలేషన్ సెంటర్ లోగానీ ఉంటూ, వైద్యాధికారులకు అందుబాటులోనే ఉండాలని ప్రభుత్వ రంగ క్సిన్హువా వార్తాసంస్థ పేర్కొంది.

ఇక క్వారంటైన్ సమయంలో వీరంతా నిత్యమూ తమ శరీర ఉష్ణోగ్రతను నమోదు చేస్తుండాలని, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా వైద్యులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక రిటర్న్ విజిట్ పేషంట్ల కోసం పలు ఆసుపత్రులు అందుకు తగ్గా ఏర్పాట్లు చేయడాన్ని తిరిగి ప్రారంభించాయి. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో మరిన్ని కరోనా కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న వైద్యులు, కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
Corona Virus
COVID-19
China

More Telugu News