- అవకాశాలను పరిశీలిస్తున్న బీసీసీఐ
- ఆ సమయంలో ఇతర దేశాలకు ఎక్కువ టోర్నీలు లేవు
- పూర్తి లీగ్‌కు కనీసం ఐదు వారాల సమయం అవసరం
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు క్రీడా రంగం కూడా కుదేలైంది. ముఖ్యంగా దేశంలో క్రికెట్ పూర్తిగా ఆగిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేయగల ఐపీఎల్ వాయిదా పడింది. ఈ నెల 29న మొదలవ్వాల్సిన పదమూడో సీజన్‌ను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అప్పుడు కూడా లీగ్ మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దాంతో, మెగా లీగ్‌ను జులై–సెప్టెంబర్ మధ్య నిర్వహించే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది.
ఐసీసీ టోర్నీలతోపాటు వివిధ దేశాల మధ్య ఎక్కువ పోటీలు లేకపోవడంతో ఈ సమయమే లీగ్ నిర్వహణకు అనువుగా ఉందని భావిస్తోంది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్ తమ స్వదేశంలో పాకిస్థాన్‌తో సిరీస్ ఆడుతుంది. అనంతరం ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. దాంతో పాటు జూన్, జులై మధ్య ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ‘ది హండ్రెడ్’(వంద బంతుల మ్యాచ్) లీగ్ కోసం ప్రణాళికలు రచిస్తోంది.
ఈ లెక్కన ఇంగ్లండ్, పాకిస్థాన్ లకు తప్ప మిగతా ప్రధాన దేశాలకు జులై–సెప్టెంబర్ పెద్దగా సిరీస్‌లు లేవు. ఆసియా కప్ మినహాయిస్తే టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్.. జూన్, జులైలో ఆస్ట్రేలియా, శ్రీలంకతో మూడేసి వన్డేల సిరీస్‌లను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల్లో మార్పులు చేసి ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం చేయాలని బోర్డు పెద్దలు ఆలోచిస్తున్నారు.
వీలైతే విదేశాల్లో..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2009 ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లోనూ ఎన్నికల కారణంగా కొంత యూఈఏలో, మరికొంత భాగం స్వదేశంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించాల్సిన అవకాశాలను బోర్డు పరిశీలిస్తున్నట్టు సమాచారం. 2009లో సౌతాఫ్రికాలో 37 రోజుల్లో ఐపీఎల్‌ను పూర్తి చేశారు. అంటే లీగ్ నిర్వహణకు కనీసం ఐదు వారాలు అవసరం. ఈ లెక్కన కొన్ని నెలల్లో పరిస్థితులు మెరుగైతే 60 మ్యాచ్‌లతో పూర్తి స్థాయి లీగ్ నిర్వహించాలన్నది బోర్డు పెద్దలు, ఫ్రాంచైజీల ఆలోచన. కానీ, ఇందులో ఒక్కో వారం తగ్గే కొద్దీ కనీసం 9 నుంచి 11 మ్యాచ్‌లను తగ్గించాల్సి ఉంటుంది.