మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచి వేములవాడకు హెలికాప్టర్ సర్వీసులు
- సర్వీసులను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- మూడు ప్యాకేజీల్లో హెలికాప్టర్ సేవలు
- ఫిబ్రవరి 23 వరకు సర్వీసులు కొనసాగుతాయన్న మంత్రి
హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చార్జీగా నిర్ణయించారు. అయితే ఒక ట్రిప్పుకు కనీసం ఐదుగురు ప్రయాణికులు ఉండాలి. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి వేములవాడ తీసుకెళ్లి దర్శనానంతరం తిరిగి హైదరాబాద్ తీసుకొస్తారు. ఇక వేములవాడలో హెలికాప్టర్ ఎక్కే ఔత్సాహికుల కోసం మరో రెండు ప్యాకేజీలు తీసుకువచ్చారు. వేములవాడ నుంచి వ్యూపాయింట్ కు టికెట్ ధర రూ.3 వేలుగా నిర్ణయించారు. ఈ ప్రయాణం నిడివి 7 నిమిషాలు ఉంటుంది.
మరో ప్యాకేజీలో వేములవాడ నుంచి మిడ్ మానేరు డ్యామ్ పరిసరాల వీక్షణకు వెళ్లేందుకు టికెట్ వెల రూ.5,500 గా నిర్ణయించారు. దీనికి కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి. ప్రయాణ నిడివి 16 నిమిషాలు ఉంటుంది. ఈ హెలికాప్టర్ సర్వీసులను తెలంగాణ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.