తుపాను గాలులు ముందుకు నెట్టడంతో... రికార్డు వేగంతో దూసుకుపోయిన బ్రిటన్ విమానం
- యూకేలో సియారా తుపాను విధ్వంసం
- ఆకాశంలో జెట్ స్ట్రీమ్ ఉత్పన్నం
- గాలివాలును అనుకూలంగా మార్చుకున్న విమానం
- విపరీతమైన వేగం అందుకున్న వైనం
వెనుకనుంచి తుపాను గాలి ముందుకు నెడుతుంటే, మరోవైపు ఇంజిన్లు అందించే శక్తిని ఉపయోగించుకుని న్యూయార్క్ నుంచి లండన్ కు కేవలం 4 గంటల 56 నిమిషాల్లో ప్రయాణించి ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ క్రమంలో గంటకు 1287 కిమీ వేగంతో దూసుకెళ్లింది.
బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 747 విమానం అంత దూరాన్ని అవలీలగా ప్రయాణించిందంటే అందుకు కారణం జెట్ స్ట్రీమ్ గాలులే. ప్రస్తుతం బ్రిటన్ లో సియారా తుపాను విలయం సృష్టిస్తోంది. దీని కారణంగా ఏర్పడిన జెట్ స్ట్రీమ్ బోయింగ్ విమానాన్ని ఒక్క ఊపుతో ముందుకు తోసుకెళ్లింది.
కాగా, ఈ మార్గంలో ఇప్పటివరకు నార్వే ఎయిర్ లైన్స్ విమానం అత్యుత్తమంగా 5 గంటల 13 నిమిషాల్లో ప్రయాణించగా, బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం ఇప్పుడా రికార్డును బద్దలు కొట్టింది. కాగా, తుపాను గాలులకు ఎదురు ప్రయాణించిన విమానాలు మాత్రం షెడ్యూల్ టైము కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా గమ్యస్థానాలు చేరుతున్నాయి.