అమీన్పూర్ బాలికపై అత్యాచారం కట్టుకథే.. తేల్చేసిన పోలీసులు!
- దుకాణానికి వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలిక
- మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కిడ్నాప్ చేసినట్టు చెప్పిన వైనం
- మాటలు పొంతన లేకపోవడంతో పోలీసుల అనుమానం
బాలికను యువకుడు బైక్పై తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. బాలికను తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, ఆమె ఫొటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఇంటి యజమానిపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం బాలిక దుకాణానికి వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తల్లికి ఫోన్ చేసి, తనను ఎవరో కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. దీంతో మాట మార్చిన బాలిక.. అత్యాచారానికి యత్నించారని చెప్పింది. ఆమె మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలికను తీసుకెళ్లిన యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.