చంద్రబాబు నటన ముందు జగ్గయ్య, ప్రకాశ్ రాజ్ దిగదుడుపే: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు నటన ముందు జగ్గయ్య, ప్రకాశ్ రాజ్ దిగదుడుపే: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

  • ఇద్దరమూ ఒకే ప్రాంతంలో పుట్టి, ఒకే చోట చదివాం
  • నేను పీహెచ్డీ పూర్తి చేశా... చంద్రబాబు చేస్తూనే ఉన్నారు
  • అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేస్తున్న నాటకాల ముందు నాటి నటులు జగ్గయ్య, నేటి నటుడు ప్రకాశ్ రాజ్ దిగదుడుపేనని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సెటైర్ వేశారు. ఈ ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన, ఇద్దరమూ ఒకే ప్రాంతంలో పుట్టి, ఒకే ప్రాంతంలో పెరిగి ఒకే వర్శిటీలో చదివామని గుర్తు చేశారు. తాను పీహెచ్డీని పూర్తి చేశానని, చంద్రబాబు మాత్రం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్న వేళ, తాజా నిర్ణయాలను ఓ పెద్దమనిషిగా స్వాగతించాల్సిన చంద్రబాబు, వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలను రెచ్చగొడుతూ, తన రాజకీయ స్వలాభాలు కాపాడుకుంటూ, తన బినామీల ఆస్తులను రక్షించుకోవడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ మూడు రాజధానులను వ్యతిరేకిస్తోందని, కర్నూలులో హైకోర్టు వద్దని చంద్రబాబు బహిరంగంగా చెప్పాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. అన్ని ప్రాంతాలకూ సమాన న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రాంతీయ విద్వేషాలను వదిలేసి, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు సహకరించాలని కోరారు.
chevireddy
Chandrababu
Prakash Raj

More Telugu News