జనారణ్యంలోకి చిరుత... కంగుతిన్న కాలనీ వాసులు!

  • హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో ఘటన 
  • పటేల్ రోడ్డులోని ఓ ఇంటిపై సంచారం 
  • స్థానికుల దృష్టిలో పడడంతో కలకలం

ఎక్కడి నుంచి వచ్చిందో...ఎలా వచ్చిందో... ఓ చిరుత ఓ ఇంటి మేడపైకి చేరింది. అటూ ఇటూ పచార్లు చేసింది. కాసేపు విశ్రాంతి తీసుకుంది. మళ్లీ లేచింది. ఇలా ఎంత సేపటి నుంచి అలా తిరుగుతోందో స్థానికులు చూశాకే హడావుడి మొదలయ్యింది. జనావాసాల మధ్య చిరుత కనిపించడంతో అక్కడి వారి పై ప్రాణాలు పైకే పోయాయి. హైదరాబాద్ నగరం శివారు షాద్ నగర్లో ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇవీ.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని పటేల్ రోడ్డులో నివసిస్తున్న విజయకుమార్ అనే వ్యక్తి ఇంటి మేడపై చిరుత సంచరించడాన్ని స్థానికులు గమనించారు. అడవిలో ఉండాల్సిన చిరుత ఏకంగా ఇంటిపై కనిపించడంతో చూసిన వారి గుండెగతుక్కుమంది. నిజం కాదేమో అనుకుని కాసేపు తేరిపారజూశారు. తాము చూస్తున్నది నిజమే అని తెలియగానే వారికి చెమట్లు పటేశాయి.

కాసేపటికి ఆ ప్రాంతంలోని చుట్టుపక్కలకు ఈ వార్త పాకడంతో కలకలం మొదలయ్యింది. కొందరు స్థానికులు చిరుతను చూడగానే భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. స్థానికులు వంద నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతమైతే పోలీసులు ఆ ఇంటికి వంద మీటర్ల పరిధిలోకి ఎవరినీ రాకుండా కట్టడి చేస్తున్నారు.

Go Back to Shorts
Hyderabad
Shadnagar
tiger

More Telugu News