ప్రియుడితో వెళ్లిపోయేందుకు యువతి సరికొత్త ప్లాన్.. సికింద్రాబాద్లో ఘటన!
- తాను చనిపోతున్నానంటూ లేఖ
- చెల్లెలికి ఇచ్చి సంజీవయ్య పార్క్ వద్ద ఎంఎంటీఎస్ దిగిన వైనం
- బ్యాగును నెక్లెస్ రోడ్డు నాలా వద్ద పడేసి ప్రియుడితో పరార్
అక్క ఇచ్చిన లేఖను విప్పి చూసిన చెల్లెలి గుండె గతుక్కుమంది. అందులో తాను చనిపోతున్నానని, తల్లిదండ్రులు తనను క్షమించాలని రాసి ఉంది. ఆమె ఈ విషయాన్ని తన చుట్టూ ఉన్న వారికి చెప్పడంతో అదికాస్తా పోలీసులకు చేరింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నాలా వద్ద కనిపించిన యువతి బ్యాగు చూసి ఆమె అందులో దూకి ఉంటుందని భావించారు. గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసిన యువతి షాకిచ్చింది. తాను చనిపోలేదని, ప్రియుడి వద్దకు వెళ్లిపోయానని తాపీగా చెప్పింది. ఆమె బతికి ఉన్న విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు.. కుమార్తెపై మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.