అందరినీ ఒప్పించడం అంత తేలికకాదు... కానీ, సుప్రీం కోర్టు ధైర్యంగా వ్యవహరించింది: మోదీ

  • అయోధ్య వివాదాస్పద భూమి హిందువులదేనని సుప్రీం తీర్పు
  • స్వాగతించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • మహోన్నతమైన తీర్పు అంటూ వ్యాఖ్యలు
అయోధ్య వివాదాస్పద భూమి హిందువులదేనంటూ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సుప్రీం కోర్టు ఇవాళ మహోన్నత తీర్పు ఇచ్చిందని కొనియాడారు. దశాబ్దాలు సాగిన న్యాయప్రక్రియ ఇన్నాళ్లకు ముగిసిందని, సుప్రీం తీర్పును దేశమంతా స్వాగతించిందని అన్నారు. సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిందని, అందరినీ ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు.

అన్ని వర్గాల వాదనలను, అభిప్రాయాలను, సూచనలను సుప్రీం కోర్టు ఎంతో సహనంతో, తెగువతో ఆలకించిందని పేర్కొన్నారు. దేశ న్యాయచరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం మొదలైందని, న్యాయమూర్తులు, న్యాయాలయాలకు శుభాభినందనలు అని వ్యాఖ్యానించారు. ఓ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించిందని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించిందని తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం నేడు సంపూర్ణత్వంతో వికసించిందని పేర్కొన్నారు. భారతదేశపు ఈ మూల మంత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని మోదీ వివరించారు. నవంబరు 9 భారత చరిత్రలో నిలిచిపోయే రోజని, పాకిస్థాన్ తో సయోధ్యలో భాగంగా కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభమైందని, మరోవైపు అయోధ్య అంశంలో చారిత్రాత్మక తీర్పు వచ్చిందని అన్నారు.
Go Back to Shorts
Ayodhya
Narendra Modi
Supreme Court
BJP

More Telugu News