భరించలేని కంపు.. వెంటనే గది నుంచి బయటకు వచ్చేసిన యడియూరప్ప

కర్ణాటక విధానసౌధలో ఎలుకలు పెద్ద సమస్యగా మారాయి. ఎలుకల నియంత్రణకు ప్రతి ఏటా ఎంతో ఖర్చు చేస్తున్నా... వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. తాజాగా, ఓ చచ్చిన ఎలుక దెబ్బకు ఏకంగా ముఖ్యమంత్రి యడియూరప్ప కార్యక్రమమే రద్దైంది. వివరాల్లోకి వెళ్తే, విధానసౌధలోని మూడవ అంతస్తులో ఉండే 313వ గదిని శక్తి కేంద్రంగా పిలుస్తారు. ఇక్కడ ప్రతి రోజు వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షలు, అధికారుల కీలక సమావేశాలు జరుగుతాయి. యాథావిధిగా పలు కమిటీలతో యడియూరప్ప సమావేశాలు జరిపేలా నిన్న కార్యక్రమాలను రూపొందించారు.

అయితే, ఆ గదిలో ఎక్కడో ఓ చచ్చిన ఎలుక ఉండటంతో గదంతా భరించలేని కంపు కొడుతోంది. అయినా, అప్పటికే అక్కడకు చేరుకున్న అధికారులు కంపును భరిస్తూనే సీఎం కోసం వేచి చూస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆ సమావేశపు గదిలోకి యడియూరప్ప ప్రవేశించారు. కంపుకు ఆయన తట్టుకోలేకపోయారు. వెంటనే బయటకు వచ్చి... గది పర్యవేక్షకులు, సంబంధిత అధికారులపై విరుచుకుపడ్డారు. భరించలేని వాసనలో గంటల సేపు ఎలా కూర్చుంటారని మండిపడ్డారు. విధి నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. వెంటనే గది మొత్తాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత సీఎం పేషీకి చేరుకుని, అక్కడ సమీక్షలను నిర్వహించారు.
Go Back to Shorts
Yediyurappa
Karnataka
Vidhana Soudha
Rat

More Telugu News