సోనియాను చచ్చిన ఎలుకతో పోల్చిన సీఎం ఖట్టర్.. మండిపడుతున్న కాంగ్రెస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియాను చచ్చిన ఎలుకతో పోల్చిన సీఎం ఖట్టర్.. మండిపడుతున్న కాంగ్రెస్

  • అధ్యక్షుడి కోసం కాంగ్రెస్ పార్టీ దేశమంతా గాలించింది
  • చివరకు మళ్లీ సోనియాగాంధీనే తీసుకొచ్చారు
  • కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైన స్థితిలో ఉంది
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని ఓ చచ్చిన ఎలుకతో పోలుస్తూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారని... గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కొత్త అధ్యక్షుడు అవుతారని ఆయన చెబుతూ వచ్చారని అన్నారు.

 మూడు నెలల పాటు కొత్త అధ్యక్షుడి కోసం దేశమంతా గాలించారని... ఆ తర్వాత సోనియాగాంధీనే మళ్లీ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని... అది కూడా చచ్చిన ఎలుకను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైన స్థితిలో ఉందని అన్నారు.

మరోవైపు, ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఖట్టర్ చేసిన వ్యాఖ్యల్లో మహిళా వ్యతిరేక గుణాలు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రెండు నెలల క్రితం కూడా ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు బీహార్ నుంచి కోడళ్లను తెచ్చుకున్నామని... ఇకపై కశ్మీర్ నుంచి తెచ్చుకోవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి.
Sonia Gandhi
Manohar Lal Khattar
Haryana
Congress
BJP

More Telugu News