కొడుకు అత్యాచారం చేస్తుంటే తల్లి వీడియో తీసింది.. యువతిని బెదిరించి రూ.4 లక్షలు గుంజింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడుకు అత్యాచారం చేస్తుంటే తల్లి వీడియో తీసింది.. యువతిని బెదిరించి రూ.4 లక్షలు గుంజింది!

  • చత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్‌ జిల్లాలో ఘటన
  • సంపన్న వర్గానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపిన యువకుడు
  • మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం
ఓ యువతిపై కొడుకు అఘాయిత్యానికి పాల్పడుతుంటే కన్నతల్లి వీడియో తీసి.. ఆ వీడియో చూపించి బాధితురాలి నుంచి లక్షలు కాజేసింది. చత్తీస్‌గఢ్‌లో జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఈ తల్లీకొడుకులు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బలోడా బజార్‌కు చెందిన యువకుడు ఆర్థికంగా బలమైన కుటుంబానికి చెందిన యువతిపై కన్నేశాడు. ప్రేమ పేరుతో ఆమెను ముగ్గులోకి దింపాడు. సంపన్న వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో ఆమె నుంచి డబ్బులు గుంజేందుకు తల్లితో కలిసి ప్రణాళిక రచించాడు.

ప్రియురాలికి మాయమాటలు చెప్పి ఇటీవల తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెను చూసిన యువకుడి తల్లి ప్రేమ ఒలకబోస్తూ ఆప్యాయంగా పలకరించింది. ఆపై స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. అవి తిన్న కాసేపటికే యువతి మగతలోకి జారుకుంది. అనంతరం ఆమెను పడకగదిలోకి తీసుకెళ్లిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మొత్తం ఘటనను యువకుడి తల్లి వీడియో తీసింది. కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన యువతి అత్యాచారం జరిగిందని గుర్తించి నిలదీసింది.

దీంతో యువకుడి తల్లి జోక్యం చేసుకుని ఈ మొత్తం ఘటనను వీడియో తీశానని, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే దానిని బయటపెడతానని బెదిరించింది. దీంతో భయపడిన యువతి.. పొలం అమ్మగా వచ్చిన డబ్బులను దాచిపెట్టమని తండ్రి ఇచ్చిన రూ.6 లక్షల్లో రూ.4 లక్షలను వారికి ముట్టజెప్పింది. అయితే, ఈ విషయం యువకుడి అక్కా, బావలకు తెలియడంతో వారు కూడా యువతిని డబ్బు కోసం బెదిరించారు. తాజాగా, తాను దాచిపెట్టమని ఇచ్చిన డబ్బులు ఇవ్వాలంటూ తండ్రి సదరు యువతిని అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్టు తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Chhattisgarh
love
girl
money
Police

More Telugu News