Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ బిగ్ బాస్ హౌస్ లో కుమార్తె రొమాన్స్... "ఇలాగేనా నిన్ను పెంచింది?" అంటూ తండ్రి ఆగ్రహం!

  • హౌస్ లోకి కుటుంబ సభ్యులకు అనుమతి
  • లోస్లియాను తిట్టిపోసిన తండ్రి
  • విమర్శలు గుప్పిస్తున్న ఫ్యాన్స్
తమిళ బిగ్‌ బాస్‌ సీజన్ 3లో భాగంగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను హౌస్ లోకి అనుమతించిన వేళ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురు పోటీ సభ్యుల కుటుంబీకులు భావోద్వేగానికి లోనవుతూ ఆనందబాష్పాలు రాల్చగా, యాంకర్‌, నటి లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. హౌస్ లోకి ఎంటరైన లోస్లియా తండ్రి, ఆమెపై విరుచుకుపడ్డారు.

తోటి కంటెస్టెంట్‌ కేవిన్‌ తో లోస్లియా సన్నిహితంగా ఉండటం, వీరిద్దరి సీన్లనూ చూసిన ప్రేక్షకులు, ఇద్దరి మధ్యా రిలేషన్‌ షిప్‌ ఉందని భావిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంతో లోస్లియా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన లోస్లియా తండ్రి, "నేను నిన్ను పెంచిన పద్ధతి ఇదేనా?" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో అప్పటివరకూ ఆనందంగా కనిపించిన లోస్లియా, ఆపై తండ్రిని హత్తుకుని బోరున ఏడ్చింది. మరో కంటెస్టెంట్ చేరన్, ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

ఇక హౌస్ లోకి వెళ్లి, కుమార్తెకు ధైర్యం చెప్పి రావాల్సిన తండ్రి, ఇలా తిట్టడాన్ని ఆమెకు మద్దతుగా నిలుస్తున్న బిగ్ బాస్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. హౌస్ లో ఇన్ని రోజులు ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు ఆమె ఎంతో కష్టపడిందని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమెకు మద్దతివ్వాలని అంటున్నారు. ఇక, కెవిన్, లోస్లియాల మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ, కార్యక్రమం హోస్ట్ కమలహాసన్ వ్యాఖ్యానించిన తరువాతనే మొత్తం వ్యవహారం హైలైట్ అవడం గమనార్హం.
Bigg Boss
Losliya
tamil
Kevin

More Telugu News