విక్రమ్ ల్యాండర్ జాడ కనుక్కోవచ్చేమో కానీ, కేసీఆర్ బడ్జెట్లో వాస్తవాలు కనుక్కోవడం ఎవరి తరం కాదు: విజయశాంతి

  • బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ సర్కారు
  • కేసీఆర్ మరో గారడీకి సిద్ధమయ్యారంటూ విజయశాంతి వ్యాఖ్యలు
  • కీలక రంగాలకు గతంలో కేటాయించిన నిధులపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ డిమాండ్
తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు చేశారు. చంద్రయాన్-2లో గల్లంతైన విక్రమ్ ల్యాండర్ జాడ కనుక్కోవచ్చేమో కానీ, తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వాస్తవాలు కనుక్కోవడం ఎవరితరం కాదని వ్యాఖ్యానించారు. గతేడాది, లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తీసుకువచ్చారని, కానీ అక్షరాస్యత విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే అట్టడుగున ఉందని తేలిందని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలితో పేద రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఆఖరికి రైతులకు యూరియా అందించే విషయంలోనూ కేసీఆర్ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శించారు. గత బడ్జెట్ లెక్కలు తేలకముందే కొత్త బడ్జెట్ తో కేసీఆర్ గారడీ మొదలుపెట్టారని ఆరోపించారు. అయితే గత బడ్జెట్ విషయంలో అవకతవకలపై బీజేపీ నేతలు నిగ్గుతేల్చేందుకు సిద్ధమైనట్టు వారి మాటల ద్వారా అర్థమవుతోందని తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
Go Back to Shorts
Vijayasanthi
KCR
Telangana
Budget

More Telugu News