Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సెల్ ఫోన్ సమాచారాన్ని దోచేశారు: బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన నటి రాధా ప్రశాంతి

  • లక్ష్మి, ఆమె కుమారుడు చక్రి దొంగిలించారు
  • పాన్ కార్డు, పాస్ పోర్టు కూడా వారివద్దే
  • కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
తనకు తెలియకుండా, తన స్మార్ట్ ఫోన్ లోని కీలకమైన చిత్రాలు, సమాచారాన్ని చోరీ చేశారంటూ సినీ నటి రాధా ప్రశాంతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వివరాలు మీడియాకు అందించారు. సినీ నటిగాను, సామాజిక కార్యకర్తగానూ పనిచేస్తున్న రాధా ప్రశాంతికి గత నాలుగేళ్లుగా డిజైనర్‌ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఉంది.

ఇటీవల ఆమె తన కుమారుడు చక్రితో కలిసి ప్రశాంతి నివాసానికి వచ్చింది. చీరల డిజైన్లను చూపిస్తానని వారు చెప్పగా, తన వాట్స్ యాప్ కు పంపాలని ప్రశాంతి కోరింది. ఆ సమయంలో తన ల్యాప్ టాప్ పని చేయడం లేదని చెప్పిన చక్రి, ప్రశాంతి సెల్ ఫోన్ ను తీసుకున్నాడు. ఆపై గంటన్నర తరువాత ఫోన్ తిరిగిచ్చి వెళ్లిపోయాడు. అనంతరం చూసుకుంటే, సెల్ ఫోన్ లోని ముఖ్యమైన ఫొటోలు, విలువైన పత్రాలు, సమాచారం మొత్తం మాయమైంది.

ఆపై చక్రికి, లక్ష్మికి ఫోన్ చేయగా, వారు వస్తామని చెప్పి రాలేదు. మరోసారి ఫోన్ చేస్తే సరైన సమాధానం రాలేదు. అలాగే లక్ష్మి తనకు జీఎస్టీ కార్డు ఇప్పిస్తానని చెప్పి తన పాన్ కార్డు, పాస్ పోర్టు, రూ. 25 వేల నగదు కూడా తీసుకుందని, కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Radha Prashanti
Police
Deta
Smart Phone
Theft

More Telugu News