అర్ధరాత్రి ఆ భవనంలో క్షుద్ర పూజలు...పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
- ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కాకినాడలో కలకలం రేపిన సంఘటన
- వరుసగా యువత, పిల్లలు చనిపోతున్నారని సిద్ధాంతిని ఆశ్రయించిన బాధితులు
వివరాల్లోకి వెళితే...కాకినాడ నగర పరిధి గొడారిగుంటలోని సీతారాంపురం సగర సామాజిక భవనంలో నిన్న అర్ధరాత్రి కొందరు క్షుద్రపూజలు నిర్వహించారు. రాజపూడికి చెందిన ఓ సిద్ధాంతి ఆధ్వర్యంలో కుండల్లో నెయ్యిపోసి దీపారాధన చేశారు. పెద్ద ఎత్తున కుంకుమ, కొబ్బరి బొండాలతోపాటు మూడు నాటు కోళ్లు సేకరించి ఉంచారు. ఈ సన్నివేశాలను గమనించిన స్థానికులు భయాందోళనలతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. సగరపేటకు చెందిన కొందరు యువకులు, పిల్లలు హఠాత్తుగా మరణిస్తుండడంతోనే వారు ఈ పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది.