తమను అమ్మలా చూసుకున్న ఆ ప్రిన్సిపాల్ వెళ్లిపోతుంటే ఏడవని వాళ్లంటూ లేరు!
- అనంతపురం జిల్లా నసనకోట గురుకులంలో భావోద్వేగ వాతావరణం
- బదిలీపై వెళ్లిపోతున్న ప్రిన్సిపాల్ సంగీత కుమారి
- కన్నీరు పెట్టిన విద్యార్థినులు, సిబ్బంది
అది మామూలు భావోద్వేగం కాదు. పిల్లల నుంచి తల్లి దూరంగా వెళ్లిపోతుంటే గుండెల్లోంచి పొంగిపొర్లే కన్నీటిబాధ! మీరు వెళ్లొద్దు మేడం అంటూ ఆ పిల్లలు ఎలాగో గొంతు పెగల్చుకుని మాట్లాడగలిగారు కానీ, అక్కడి చిన్నారులతో తన బంధం ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థమైన ఆ ప్రిన్సిపాల్ ఒక్క మాట కూడా మాట్లాడలేక కన్నీటిసుడుల మధ్య చిక్కుకుపోయింది. విద్యార్థినుల సంగతి అటుంచితే, ఆ గురుకులంలోని నాల్గో తరగతి ఉద్యోగులు సైతం ప్రిన్సిపాల్ సంగీతకుమారి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుటుంబసభ్యురాలే వెళ్లిపోతోందన్నంత ఇదిగా బాధపడ్డారు.
సంగీత కుమారి కోసం ఓ స్కూలు మొత్తం కన్నీరుపెట్టడం వెనుక బలమైన కారణమే ఉంది. ఓ మామూలు పాఠశాలగా ఉన్న ఆ గురుకులాన్ని సంగీతకుమారి కొద్దికాలంలోనే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కరితో మానవీయ కోణంలో వ్యవహరించడం ఆమెను వారికి బాగా దగ్గర చేసింది. తమను అమ్మలా చూసుకునేవారని, ఆమెను బదిలీ చేయొద్దంటూ అధికారులను కోరతామని అక్కడి విద్యార్థినులు చెబుతున్నారు.