వద్దన్నా టిక్ టాక్ వీడియోలు పెడుతోందని భార్యను కత్తికి బలి చేసిన భర్త
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వద్దన్నా టిక్ టాక్ వీడియోలు పెడుతోందని భార్యను కత్తికి బలి చేసిన భర్త

  • కొంప కొల్లేరు చేసిన టిక్ టాక్ వీడియోలు!
  • అసభ్య వీడియోలు పోస్టు చేసిన భార్య
  • కోపంతో రగిలిపోయిన భర్త
టిక్ టాక్ వీడియోలు ఓ కాపురాన్ని నిలువునా కూల్చాయి! ఇష్టంవచ్చినట్టు టిక్ టాక్ వీడియోలు చేస్తూ తనకు చెడ్డపేరు తెస్తోందన్న కారణంతో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందీ ఘటన. కోయంబత్తూరు నగరంలోని వేలినగర్ లో ఉండే కనకరాజ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. కనకరాజ్ కు భార్య నందిని, ఓ కుమార్తె ఉన్నారు.

అయితే, కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో నందిని పుట్టింట్లో ఉంటోంది. నందిని తన ఇంటికి దగ్గర్లోనే ఓ కాలేజీలో పనిచేస్తోంది. ఆమె గతకొంతకాలంగా టిక్ టాక్ వీడియోలు రూపొందించి ఆన్ లైన్ లో పెడుతోంది. ఆ వీడియోలు కాస్త శృతిమించినట్టుగా ఉండడంతో కనకరాజ్ భార్యను మందలించాడు. అసభ్యంగా ఉంటున్నాయని, అలాంటి వీడియోలు చేయవద్దని కోరాడు.

భర్త మాటలను పెడచెవినపెట్టిన నందిని తాజాగా మరికొన్ని టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసింది. వాటిలో ఆమె తీరు అశ్లీలతకు దగ్గరగా ఉండడంతో కనకరాజ్ మండిపడ్డాడు. భార్యకు ఫోన్ చేస్తే ఆమె తీయలేదు. దాంతో ఆమె పనిచేస్తున్న కాలేజీకి వెళ్లి గొడవపెట్టుకున్నాడు. అప్పటికే మద్యం మత్తు తలకెక్కి ఉండడంతో కనకరాజ్ కత్తితో ఇష్టంవచ్చినట్టు పొడిచాడు. దాంతో నందిని కుప్పకూలిపోయింది. కాలేజీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు భర్త కనకరాజ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Tik Tok

More Telugu News