‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్

  • ఆ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదు
  • సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ
  • నాకు అపారమైన గౌరవం ఉంది
‘చౌకీదార్ చోర్’ వ్యాఖ్యలపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తాను ఆ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ అని, దానిపై తనకు అపార గౌరవముందని పేర్కొంటూ రాహుల్ మూడు పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పు మోదీని ‘చౌకీదార్ చోర్’ అని స్పష్టం చేస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై స్పందించిన సుప్రీం తామెక్కడా ఆ వ్యాఖ్యలు చేయలేదని, తమకు తప్పుగా ఆపాదించారని స్పష్టం చేస్తూ దీనిపై రాహుల్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాహుల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంటూ గత నెల 22న అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఆ అఫిడవిట్‌లో విచారం అనే పదాన్ని బ్రాకెట్‌లో ఉంచారని మీనాక్షి తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 దీనిపై సుప్రీంకోర్టు రాహుల్‌కు గత నెల 23న నోటీసులిచ్చింది. ఆ నోటీసులపై స్పందించిన రాహుల్ పాత అంశాలనే చెబుతూ మరోసారి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో రాహుల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాను క్షమాపణలు చెబుతానని రాహుల్ తెలపడంతో సుప్రీంకోర్టు ఆయనకు మరో అవకాశమిచ్చింది. దీనిలో భాగంగానే నేడు రాహుల్ సుప్రీంకోర్టును క్షమాపణ కోరారు.
Go Back to Shorts
Rahul Gandhi
Narendra Modi
Supreme Court
Minakshi Lekhi
Mukul Rohatgi

More Telugu News