ఐసిస్ చీఫ్ బాగ్దాదీ బతికే ఉన్నాడు.. ఐదేళ్ల తర్వాత తొలి వీడియో విడుదల

  • ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఐసిస్ చీఫ్
  • ఇస్లాంపై క్రైస్తవుల క్రూరత్వానికి ముగింపు తప్పదన్న బాగ్దాదీ
  • 40 సెకన్లపాటు మాత్రమే మాట్లాడిన వైనం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్-బాగ్దాదీ బతికే ఉన్నాడు. సిరియాలో పాతుకుపోయిన ఐసిస్‌ను అక్కడి సైన్యం తరిమికొట్టింది. ఈ క్రమంలో జరిగిన బాంబు దాడుల్లో అతడు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అది నిజం కాదని తేలింది. 2014 నుంచి కనిపించకుండా పోయిన బాగ్దాదీ తాజాగా ఓ వీడియోలో దర్శనమిచ్చాడు.

శ్రీలంకలో ఈస్టర్ సండే నాడు ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఐసిస్ ప్రకటించింది. ఐదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న బాగ్దాదీ శ్రీలంక పేలుళ్ల తర్వాత వీడియోలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కలష్నికోవ్ రైఫిల్ పట్టుకుని బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాగ్దాదీ ఆ వీడియోలో కేవలం 40 సెకన్లపాటు మాత్రమే మాట్లాడాడు. ఇస్లాం కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్న బాగ్దాదీ సిరియా పట్టణమైన బాఘుజ్‌లో తమ పోరాటం ముగిసిందన్నాడు. ఇస్లాంపై క్రైస్తవుల క్రూరత్వం, హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయన్నాయని, వాటికి ముగింపు తప్పదని హెచ్చరించాడు.
Go Back to Shorts
Baghdadi
ISIS
Sri Lanka
Terror attack
syria
baghuz

More Telugu News