నేను మరణించిన తరువాత నా వారసుడు ఇండియా నుంచే వస్తాడు!: దలైలామా

  • 60 ఏళ్ల క్రితం ఇండియాకు వచ్చేసిన దలైలామా 
  • చైనా ఎవరినో తెరపైకి తేవాలని చూస్తుంది
  • భవిష్యత్తులో ఇద్దరు లామాలు ఉండే చాన్స్ ఉందన్న లామా
తాను మరణించిన తరువాత, తన వారసుడిగా ఎవరి పేరునో చైనా తెరపైకి తేవాలని చూస్తుందని, అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి లేదని దలైలామా వ్యాఖ్యానించారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇండియా నుంచే తన వారసుడు రానున్నాడని స్పష్టం చేశారు. చైనా హత్య చేయాలని చూస్తుంటే, టిబెట్ రాజధాని లాసా నుంచి తప్పించుకుని వచ్చి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా దలైలామా మాట్లాడారు. 1959లో తాను ఇండియాకు వచ్చానని, అప్పటి నుంచి ప్రపంచదేశాల మద్దతుతో తన భూభాగం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన అన్నారు.

 టిబెట్ ను 1950లో ఆక్రమించిన చైనా, దలైలామాను ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణించగా, ఆయన అప్పటి నుంచి ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం 83 సంవత్సరాల వయసులో ఉన్న దలైలామాను నోబెల్ శాంతి బహుమతి వరించిన సంగతి తెలిసిందే. "చైనాకు తెలుసు నా వారసుడి ఎంపిక చాలా కీలకమని. ఈ విషయంలో నాకన్నా చైనాయే చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ, నా వారసుడు ఇండియా నుంచే వస్తాడు. భవిష్యత్తులో ఇద్దరు దలైలామాలు కనిపించినా ఆశ్చర్యపోవద్దు. ఒకరు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండవచ్చు. అతన్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఆపై అది చైనాకు అదనపు సమస్యగా మారుతుంది" అని ఆయన హెచ్చరించారు.

కాగా, దలైలామా వారసుడి ఎంపిక హక్కు తమదేనని చైనా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. టిబెటన్ల నమ్మకం ప్రకారం, దలైలామా మరణిస్తే, ఆయన ఆత్మ ఓ చిన్నారిలోకి ప్రవేశిస్తుంది. ఆ చిన్నారిని గుర్తించే ప్రక్రియను బౌద్ధ గురువులు పూర్తి చేసి, వారసుడిని ప్రకటిస్తారు. 1935లో జన్మించిన ప్రస్తుత దలైలామాను, ఆయన రెండేళ్ల వయసులో ఉండగానే మతగురువులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన 14వ లామాగా కొనసాగుతూ, వయసు పైబడిన కారణంగా వచ్చే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
Go Back to Shorts
Dalailama
Dharmashala
China

More Telugu News