సీన్ రివర్స్... పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడని ప్రియుడి దారుణ హత్య!
- ప్రకాశం జిల్లాలో గద్వాల యువకుడి హత్య
- ప్లాన్ ప్రకారం రప్పించి చంపించిన యువతి
- నిందితులను పట్టించిన సెల్ ఫోన్ డేటా
పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన స్వాతికి, గద్వాలకు చెందిన శ్రీనివాసులుకు చాలాకాలంగా పరిచయం ఉంది. ఇద్దరికీ కుటుంబాలు ఉన్నాయి. అయినా, ఇద్దరమూ పెళ్లి చేసుకుందామని శ్రీనివాసులు ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేని స్వాతి, తన తండ్రి, సోదరుడితో చర్చించి అతన్ని హతమార్చేందుకు నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో గత శనివారం నాడు మార్కాపురం రావాలని కోరడంతో శ్రీనివాసులు అక్కడికి వెళ్లాడు. ఆపై ఇంటిపై అంతస్తులోకి అతన్ని తీసుకెళ్లిన స్వాతి, ఆమె తండ్రి వెంకట్ రెడ్డి, సోదరుడు చక్రపాణి రెడ్డి కలసి అతన్ని దారుణంగా హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లి దహనం చేశారు. శ్రీనివాసులు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఫోన్ కాల్స్ ఆధారంగా విచారించిన పోలీసులు, అతను చివరిగా మార్కాపురం వెళ్లాడని గుర్తించారు. ఆపై స్వాతిని అనుమానించి, తమదైన శైలిలో ప్రశ్నించగా, అసలు వాస్తవం బయటకు వచ్చింది. ఏపీ పోలీసుల సాయంతో మృతదేహాన్ని కాల్చిన స్థలానికి వెళ్లిన పోలీసులు, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని వెల్లడించారు.