పెళ్లిలో అపశ్రుతి.. బరాత్ డ్యాన్సులతో రెచ్చిపోయిన స్నేహితులు.. బ్రిడ్జి కూలి డ్రైనేజీలో పడిన పెళ్లి కొడుకు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లిలో అపశ్రుతి.. బరాత్ డ్యాన్సులతో రెచ్చిపోయిన స్నేహితులు.. బ్రిడ్జి కూలి డ్రైనేజీలో పడిన పెళ్లి కొడుకు!

  • రోడ్డుకు, ఫంక్షన్ హాల్‌కు మధ్య చిన్నపాటి బ్రిడ్జి
  • బరువుకు తట్టుకోలేక కుప్పకూలిన బ్రిడ్జి
  • ఫంక్షన్ హాలు యజమానితో గొడవ
ఓ పెళ్లి వేడుకలో వరుడి తరపు స్నేహితులు, బంధువులు ఉత్సాహంగా చిందులేశారు. అయితే, బీభత్సంగా చేసిన ఈ డ్యాన్స్ వికటించింది. వారి స్టెప్పులకు తట్టుకోలేని చిన్నపాటి ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. అంతే, పెళ్లికొడుకు డ్రైనేజీలో పడిపోయాడు. నోయిడాలోని హోషియార్‌పూర్‌లో జరిగిందీ ఘటన.

పెళ్లి కోసం బుక్ చేసిన మండపానికి, రోడ్డుకు మధ్య మురుగు కాలువ ఉంది. దానిపై చిన్నపాటి బ్రిడ్జిని ఫంక్షన్ హాల్ యజమాని తాత్కాలికంగా ఏర్పాటు చేశాడు. పెళ్లి కొడుకుని ఆహ్వానించేందుకు బ్రిడ్జికి ఆ వైపున వధువు తరపు బంధువులు వేచి చూస్తున్నారు. వరుడిని బాజాభజంత్రీలతో పెళ్లి మండపానికి అట్టహాసంగా తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు తరపు స్నేహితులు చేసిన డ్యాన్స్‌కు తట్టుకోలేని ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వరుడు సహా 15 మంది మురికి కాల్వలో పడిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో అప్పటి వరకు ఆనందంగా సాగిన పెళ్లి వేడుక కాస్తా విషాదంగా మారిపోయింది.

డ్రైనేజీలో పడిపోయిన వరుడు, మరో 15 మంది స్వల్పగా గాయపడ్డారు. పెళ్లికొడుకు ధరించిన బంగారు నగలు కాల్వలో పడిపోయాయి. అయితే, ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై ఫంక్షన్ హాల్ యజమానితో పెళ్లికొడుకు బంధువులు గొడవకు దిగారు. చివరికి విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో ఫంక్షన్ హాల్ బుకింగ్ కోసం చెల్లించిన రూ. 3 లక్షలను తిరిగి ఇచ్చేందుకు దాని యజమాని అంగీకరించాడు. అనంతరం మళ్లీ తయారైన పెళ్లికొడుకు పెళ్లిపీటలపై కూర్చోవడంతో పెళ్లి జరిగింది.
Groom
drain
bridge collapse
baraat
Noida

More Telugu News