చిరంజీవి గారు చేతులు కట్టుకుని నుంచోవడం నాకు నచ్చలేదని చెప్పాను: నటుడు రాజా రవీంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి గారు చేతులు కట్టుకుని నుంచోవడం నాకు నచ్చలేదని చెప్పాను: నటుడు రాజా రవీంద్ర

  • 'స్నేహం కోసం' షూటింగుకి వెళ్లాను
  • దర్శకుడికి నా అభిప్రాయం చెప్పాను
  • నేనన్న మాట చిరంజీవి వరకూ వెళ్లింది      
బుల్లితెరపై నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న రాజారవీంద్ర .. ఆ తరువాత వెండితెరకి వెళ్లాడు. ముఖ్యమైన పాత్రలను చేస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. 'చిరంజీవి గారితో పరిచయం ఎలా ఏర్పడింది?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. దర్శకుడు కేఎస్ రవికుమార్ .. చిరంజీవిగారితో 'స్నేహం కోసం' సినిమా చేస్తున్నారు. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన షూటింగుకి రమ్మంటే లొకేషన్ కి వెళ్లాను. ఆల్రెడీ తమిళంలో ఆయన ఈ సినిమాను శరత్ కుమార్ తో చేశారు .. ఆ సినిమాను నేను చూశాను.

తమిళంలో రజనీకాంత్ చేసిన సినిమాను తెలుగులో చిరంజీవిగారితో చేయాలిగానీ, శరత్ కుమార్ చేసిన సినిమా చిరంజీవితో చేయడమేంటని కేఎస్ రవికుమార్ ను అడిగాను. ఎంత స్నేహితులైనా విజయ్ కుమార్ దగ్గర చిరంజీవి చేతులు కట్టుకుని నుంచోవడం నాకు నచ్చలేదని చెప్పాను. ఈ విషయం చిరంజీవి వరకూ వెళ్లింది .. ఆయన పిలిచి అడిగితే అదే మాట చెప్పాను. నేను అలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం చిరంజీవిగారికి నచ్చింది. అప్పుడు చిరంజీవిగారితో మొదలైన పరిచయం .. ఆయనతో సాన్నిహిత్యాన్ని పెంచుతూ వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.
rajaravindra

More Telugu News