మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ను బెదిరించిన దొంగ.. షేపులు మారిపోయేలా చావగొట్టిన యువతి!
- బ్రెజిల్ లోని రియో డిజనీరోలో ఘటన
- బొమ్మ తుపాకీతో బెదిరించిన దొంగ
- పోలీసులకు అప్పగించిన పోల్యానా
రియో డిజనీరోలో ఎంఎంఏ ఫైటర్ పోల్యానా వైనా(26) నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఓ చోటకి వెళ్లేందుకు ఉబెర్ కారును బుక్ చేసింది. ఇంతలోనే ఓ యువకుడు అటుగా వెళుతూ ఆమెను టైమ్ ఎంత అయిందని అడిగాడు. దీనికి పోల్యానా మర్యాదగా జవాబు చెప్పింది. అయితే అతను అక్కడే పక్కన నిలబడ్డాడు. అనంతరం మెల్లిగా ‘నీ పర్సు, మొబైల్ తీసి ఇచ్చేయ్. అరవకు. నా దగ్గర తుపాకీ ఉంది’ అని హెచ్చరించాడు.
దీంతో షాక్ కు గురైన పోల్యానా ఆ తుపాకీ వైపు చూసింది. అది బొమ్మ తుపాకీ అని అర్థం చేసుకున్న పోల్యానా ఒక్కసారిగా అతనిపై విరుచుపడింది. ముఖంపై పంచ్ లు విసురుతూ, కాలుతో కిక్ ఇస్తూ అతడిని చావగొట్టింది. దీంతో క్షణాల్లో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు తొలుత సదరు దొంగను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అతడిని స్టేషన్ కు తీసుకెళ్లి కేసు నమోదుచేశారు.