ముస్లిం యువకుడిని ప్రేమించిన కుమార్తె.. పరువు తీసిందంటూ కత్తితో దాడి చేసిన తండ్రి!
- నెల్లూరు జిల్లా గూడూరులో ఘటన
- స్థానికులు అడ్డుకోవడంతో పరారైన తండ్రి
- కేసు నమోదుచేసిన పోలీసులు
జిల్లాలోని గూడూరుకు చెందిన దేవయాని స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో జావేద్ అనే యువకుడిని దేవయాని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సిద్ధయ్య కోపంతో ఊగిపోయాడు. పరాయి మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి తన పరువు తీసిందన్న అక్కసుతో ఈరోజు జీఎస్ రాయల్ సెంటర్ ప్రాంతంలో కుమార్తెపై కత్తితో బలంగా దాడిచేశాడు.
దీంతో దేవయాని తలపై తీవ్రమైన గాయం అయింది. అనంతరం మరోసారి దాడిచేయబోగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో సిద్ధయ్య ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కాగా బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.