తమిళనాడులో కుల హత్య.. యువకుడిని కొట్టి చంపిన అమ్మాయి తల్లిదండ్రులు!
- నమక్కల్ జిల్లాలోని పల్లిపాళాయం లో ఘటన
- ప్రేమించుకున్న యువతీయువకులు
- నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు
జిల్లాలోని పల్లిపాళాయం గ్రామానికి చెందిన కె. ధర్మరాజు (27) ఆటోడ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(16)తో ధర్మరాజుకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారు. అయితే కులాలు వేరుకావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వెంటపడొద్దని ధర్మరాజును అమ్మాయి తల్లిదండ్రులు హెచ్చరించారు.
అయినా వినకుండా మరోసారి ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లడంతో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు రెచ్చిపోయారు. దొరికిన కర్రలతో ధర్మరాజును విచక్షణారహితంగా చావబాదారు. దెబ్బల తీవ్రతకు అతను స్పృహ కోల్పోవడంతో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ధర్మరాజు అక్కడే చనిపోయాడు.
కాగా, తమ కుమారుడిని హత్యచేసిన నిందితులను అరెస్ట్ చేయాలని ధర్మరాజు కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.